పేజీలు

24 మార్చి, 2009

శ్రీ రమణ మహర్షి భోధన .... ( నేనెవరు మీద ధ్యాసపెట్టి నీవెవరో తెలుసుకో ..సమస్తం తెలుస్తుంది)

please visit our website . http://ramthamedia.in/ నిత్యజీవితంలో మనుష్యలు నిరంతరం ఏవో కొన్ని ప్లాన్లు వేస్తూనే ఉంటారు.వాస్తవానికి భగవంతుడు ఒక ప్లాను ప్రకారమే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు.మనుషులు నిరంతరం ప్లాన్లువేయడం రైలులో ప్రయాణించే ప్రయాణికుడు తన లగేజిని నెత్తిన పెట్టకుని మోయడంలాంటిది.మనుష్యలు ప్లాన్లు వేయడం మాని భగవంతుడికి పరిపూర్ణ శరాణగతి చెందడమే ఉత్తమమైన ప్లాను.నీవు పరిపూర్ణ శరణాగతి చెందిన నాడు నీకు ఏది మంచిదో భగవంతుడికి సరిగ్గా తెలుసు.మీరే బాధ్యతలు పెట్టుకోకండి.అఖిలాండ కోటిని కనిపెట్టే భగవంతుడు పరిపూర్ణ శరణు చెందిన మిమ్మల్ని మర్చిపోతాడా?కష్టాలు తొలిగిపోవాడానికి రోజులా ,సంవత్సరాల,జన్మలా అని మాత్రం ఎదురుచూడవద్దు.భగవంతుడు మిమ్మల్ని చూడడం అంటే ధనికునిగా చేయడంగా మీరు ఆలోచిస్తున్నట్లయితే మీలో అహంకారం ఇంకా బుసలు కొడుతున్నదనే అర్థం. భగవంతడు ప్రతి ఒక్కరిని కనిపెడుతూనే ఉన్నాడు.నీకేది అవసరమో అది ఆయన ఇస్తూనే ఉంటాడు. శరణాగతి రెండింటిమీద ఆదారపడిఉంటుంది.ఒకటి మీరు చేసే ప్రయత్నం,రెండు ఈశ్వరానుగ్రహం. ‘‘నేను’’ అనేది ఒక మహా మంత్రం.ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది.ఇది భగవంతుని మొదటి నామం. ఈ నామం ద్వార ‘‘నేనెవరు’’మీద ధ్యాసపెట్టి ధ్యానం చేయండి.ధ్యానం చేయడం మీ స్వప్రయత్నం, ‘‘మీరెవరో ’’తెలియడం ఈశ్వరనుగ్రహం.మీకు ఆత్మన్వేషణకు బుద్దికలుగడమే ,ఈశ్వరనుగ్రహానికి బండ గుర్తు.ఇది మీ హృదయంలో ప్రకాశిస్తు మిమ్మల్నిలోపలికి గుంజుతుంది.మీరు చేయాల్సిన ప్రయిత్నం అంతా నేనెవరు అంటూ విచారించడమే,ధ్యానం చేయడమే.మనం భగవంతున్ని స్మరించాం అంటే అది భగవంతుని అనుగ్రహం.అనుగ్రహం అనేది భగవంతుడికి ఒక గుణం కాదు.అనుగ్రహమే భగవంతుడు.ఆయన అందరిని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు.పక్షి తన రెక్కలతో గుడ్డును రక్షించినట్లుగా,తల్లి పాలు తాగే పాపాయిని కంటికి రెప్పలా చూసుకున్నట్లుగా అయన రక్షిస్తూనే ఉంటాడుమీ పాపాయిని మీరెంత శ్రద్దగా చూసుకుంటున్నారో ఆపాపాయికి తెలియకపోవచ్చుఅలాగే మీరు..అయితే ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మాలి.నమ్మడం అంటే భక్తితో ఉండడం కాదు.భక్తికి శరణాగతికి మూలంలోనే తేడా ఉంది.భక్తిలో ‘‘నేను,నీవు’’అనే ధ్వైత్వంతో కూడిన తేడా ఉంది.శరణాగతిలో ధ్వైత్వం లేదు.అంటే మాటవరుసకు నోటితోనో,మనసులోనే ‘‘ఈశ్వరా...నా భారమంతా ఇకపై నీదే’’అంటే చాలదు.సుఖ దుఃఖాలు,చివరకు ‘‘నేను’’కూడ మాయమవ్వాలి.భగవంతుడు తప్పతానులేడు.ఇట్లా అహం చనిపోయినప్పుడే పూర్ణ శరణాగతి సాథ్యం.భగవంతుడున్నాడని,ఆయన నీకు సర్వస్వము చేసి పెడుతాడని గట్టిగా నమ్మినపుడే మీరు పరిపూర్ణ శరాణగతి చెందగలరు.మీకు అటువంటి నిశ్చలమైన నమ్మకంలేకుంటే భగవంతుణ్ణి అతని దారికి అతన్ని వదిలేసి నీవెవరివో తెలుసుకోవడానికి ప్రయత్నించడండి.శరణాగతి మార్గం లేదా ‘‘నేనెవరు’’విచారణ ద్వార సమస్త శక్తిని అక్కడ కేంద్రీకరించి, ‘‘నేను’’ను తెలుసుకోవడమే జ్ఞాన మార్గం.విచారణ,శరాణగతి ఒకే పలితాన్ని ఇస్తాయి.ఇక్కడ రమణుల ఉద్దేశ్యం బయట లోకంలో కోట్లాది మంది అసలు ఎందుకు పుట్టారో,పెరిగారో తెలియకుండానే మరణిస్తున్నారు.ఈ శరీరం ఈ జన్మలో నిలబడి ఉండగానే మీరెవరో తెలసుకోవడమే ఏకైక జీవిత లక్ష్యంగా పెట్టకోండి.ఈ శరీరం, ఈ జన్మ గతి తప్పిందా మళ్ళీ మరణం,ఏక కణజీవి నుండి బహుకణ జీవిగా రూపాంతరం,నవమాసాలు మరొక తల్లి గర్భంలో పెరిగి పెద్దయి,జన్మతీసుకుని మళ్ళీ జీవితంలో ఒక దశ వచ్చినప్పడు ఈ జీవితం అంటే ఏమిటి,నేనెవరు అనే చింతన మొదలు పెడుతారా?ఎంత బహుదీర్ఘ ప్రయాణం?రాజకీయవేత్తలు,అధికారులు,ధనవంతులు బాహ్య ప్రపంచంలో భౌతికంగా ఎంతో సాధించవచ్చు. వారెవ్వరో తెలుసుకోకుండానే వారి జీవితాలు ముగిసిపోతుంటాయి. కర్త జీవుల ప్రారబ్దానుసారం వారిని ఆడించును.జరుగబోయేది ఎవరెంత అడ్డుపడిన జరుగును.జరుగబోనిది ఎవరెంత ప్రయత్నించిన జరగును.‘‘ఒక పనిచేస్తాను లేదా చెయ్యను’’ అని ముందే నిర్ణయించుకోవడం మంచిదికాదు.మీరు పనిచేయవలసిన విధిలేకపోతే మీరు పనికై ప్రయత్నించిన లబించదు.పనిచేయవలసిన విధి ఉంటే కాదని తప్పించుకోవాలని ప్రయత్నించిన నీకై వెంటాడి వేటాడి బలవంతంగా చేయిస్తుంది.కనుక ఏదేని ఒక పనిచేయడానికి ఛేయకుండా ఉండడానికి సంసిద్ధుడుగా ఉండండి.ప్రతి వారు ఒక పనిచేయడానికే ఈ భూమి మీదకు వచ్చారు.మీరు ఇష్టపడ్డా పడకపోయినా మీకు విధించబడిన పనిని ,భగవంతుడు మీ చేత బలవంతంగా చేయించి తీరుతాడు. కర్మయోగ రహస్యం తాను కర్తను కాదని తెలుసుకోవడమే ధ్యానం అంటే ఏమిటి? మనల్ని నిరంతరం వెంటాడే శతకోటి అలోచనల ద్రుష్టి మరల్చి ఒక్క ఆలోచనపైనే ద్రుష్టి పెట్టడమే ధ్యానం.ఇలా అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు శక్తి కలుగుతుంది.రమణ మహర్షి చెప్పే ధ్యానంలో ప్రత్యేకత ఏమంటే ధ్యానించే వాడినే ధ్యానించాలి.అంటే ధ్యానించేవాడు,ఎవరికి వారే అయిన‘‘నేను’’ కనుక, ఆ ‘‘నేను’’ను పట్టకోవాలి.ఆ నేను ఎక్కడుందో ఆమూలాన్ని పట్టుకోవాలి. ఆత్మ విచారణకు సాంప్రదాయకంగా అనేక మార్గాలు ఉన్నాయి. ఈ విచారణలో ఆత్మను, అనాత్మను గురించి విచారించడం జరుగుతుంది.ఈ సాంప్రదాయమార్గాలకు మనసు ఒక పరికరం.అసలు దోషి అయిన ‘‘నేను’’ ఈ విచారణలో భధ్రంగా ఉండి ఎటు తేలదు..రమణులు చెప్పిన విచారణ అయిన ‘‘నేనెవరు’’ఇందుకు పూర్తిగా విభిన్నమైనది ‘‘నేనెవరు’’అని తనను తాను వేసుకునే సూటి ప్రశ్న సకల దోషాలకు మూలమైన ‘‘నేను’’పైనే గురిపెడుతుంది.ఇక్కడ ఇక ‘‘నేను’’ తప్పించుకోవడానికి వీలులేదు.అంటే ‘‘నేనెవరు’’అనే సూటి ప్రశ్న నేను పైనే నిలబడుతుంది.దాంతో ఇక్కడ అసలు దోషి ‘‘నేను’’దొరికిపోతాడు. ‘‘నేనెవరు’’ అనే విచారణతో మనస్సు అణుగుతుంది. ఈ ‘‘నేను’’ అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనల అన్నింటిని అణగదొక్కి చివరకు మనసే తన ఉనికిని కూడా కోల్పోయి అణిగిపోతుంది.‘‘నేను’’ అనే ఆలోచన అన్ని ఆలోచనలను నశింపచేసి,తాను నశించును. ‘‘నిజమైన నేను’’ఆది అంతంలేని అనంతసాగరం లాంటిది. ఈ అనంత సాగరంలో ‘‘మాయా నేను’’ నీటి బుడగలా ఏర్పడుతుంది.ఈ నీటి బుడగనే జీవుడు(మొదటి ఆలోచన)లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు. నిజానికి ఈ బుడగకూడ నీరే,నీరులో బాగమే. ఇది బద్దలైనపుడు పూర్ణసాగరంలో కలిసిపోతుంది. ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడ సాగరంలో ఒక భాగంగానే ఉన్నది. ఈ సరళ సత్యాన్ని విస్మరించి - ఎన్నో సిద్దాంతాలు రూపుదిద్దుకున్నాయి. ఆత్మజ్ణాన అన్వేషికి ‘‘నేను’’ను విచారించడమే సూటి అయిన మార్గం.అన్నింటికి కారణమైన ‘‘నేను’’ను విచారించకుండా మనసు,బుద్ది,ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తే లాబం లేదు. ‘‘నేను’’ పోయిందా ,‘‘నేను’’ను ఆదారం చేసుకుని బతుకుతున్న ఇవన్ని ఎగిరిపోతాయి.‘‘నేను’’ అనేది మహా మంత్రం. ‘‘నేను’’ అనేది దేవుడి మొదటి పేరు.ఇది ‘‘ఓం’’కారం కన్నా మహా శక్తి వంతమైనది. ‘‘నేను’’ అనే ఆలోచన పుట్టిన తరువాతే, క్షణం , క్షణం మారే వేలకొద్ది ఆలోచనలు పుడుతున్నాయి.ఇన్ని ఆలోచనలకు మూలమైన , ఇన్ని ఆలోచనలను ఆలోచిస్తున్న ఈ ‘‘నేనెవరు’’ ను నిరంతరం ఆలోచిస్తే ఆ నిజమైన ‘‘నేను’’అనుభవమవుతుంది. నిద్రపోయే ముందు ,నిద్రనుండి మేల్కొన్నవెంటనే ‘‘నేనెవరు’’ను ప్రశ్నించుకోవాలి.ఈ రెండు సమాయాల్లో అఖండ విశుద్ద ప్రజ్ణ ఒక్క తృటి కాలం పాటు ఉంటుంది.ఇవి ధ్యానానికి ఉత్తమ సమాయాలు. మనస్సు అప్పుడు పరిశుద్దంగా ఉంటుంది. ఇతర సాధనలలాగ ‘‘నేనెవరు’’అంటూ ధ్యానం చేయడం ఒక భావన మాత్రం కాదు. ప్రత్యక్ష అనుభవం నుండి సూటిగా ఆత్మకు ప్రయాణించడం.‘‘నేను’’అని మాట్లాడటం,ఆలోచించడం,వ్యవహరించడం అందరికి నిత్యం ఉండే అనుభవంలోకి వచ్చేదే.ఈ నేను అనేది సాక్షాత్తు ‘‘ఆత్మ’’నుండి నుండి పుట్టకు వస్తుంది.నేనెవరు అని ధ్యానం చేయండం ఆత్మలోకానికి వెళ్ళే సూటి అయిన మార్గం. జన్మతేథిని పుట్టని రోజు వేడుక జరుపుకోవడంలో పెద్ద విశేషం లేదు.శరీరం పుట్టిన రోజుని కాకుండా ‘‘నేను’’పుట్టిన ఆత్మజన్మస్థానం తెలుసుకున్న రోజే నిజమైన పుట్టిన రోజు. నేను అనే మొదటి ఆలోచనపైనే పంచకోశాలతో కూడిన మూడు దేహాలు ఉన్నాయి.మొదటిది రక్త మాంసాలతో కనపడే స్థూల శరీరం.రెండవది ఈ స్థూల శరీరాన్ని ఆవరించుకుని తొడుగులా ఉండే సూక్ష్మశరీరం.మూడవది జీవికి జన్మలు ఏర్పడడానికి మూల బీజమైన కారణ శరీరం. ‘‘నేను’’ పుట్టుక స్థానానికి చేరుకుంటే ఈ మూడు దేహాలు కూలిపోతాయి. కోర్కెలను తీర్చుకోవడం ద్వార మనకు ఎన్నడు శాంతి లబించదు.ఒక కోరిక తీరిన తరువాత మరొక కోరిక ఇలా అనంతంగా వస్తూనే ఉంటాయి.కోర్కెలను బలవంతంగా అణిచిపెట్టడం వలన ఎలాంటి ఉపయోగం లేదు.కోర్కెల్లో ఉన్న మూల స్వభావం వాటిని అణిచి పెట్టిన కొద్ది రెట్టించిన బలంతో విరుచుక పడుతాయి.కోర్కెలను అణిచి పెట్టడానికి ఒకే దారి ఉంది.ఇన్ని కోర్కెలు కోరుతున్నది ఎవరు,ఎవరికి అని ప్రశ్నించుకుంటే నేను,నాకు అనే సమాదానం వస్తుంది. అప్పడు ఆ నేను పైన దృష్టి పెట్టి నేనెవరు తెలుసు కోవడానికి ప్రయత్నించాలి.ఆ నేనెవరు తెలుసుకున్న రోజున అన్ని కోర్కెలు వాటంతట అవే నశించిపోవడమే కాదు కోరుకోవడానికే ఏమి ఉండని ఉత్తమ స్థితికి చేరుకొంటారు. ప్రతి ఒక్కరు ప్రతి క్షణం కూడ నేను అనుభూతిలో ఉంటున్న కూడ , ఆ నేను బయటి ప్రపంచంతో వ్యవహరించడానికి బాహ్యముఖంగా ఉండడంతో ప్రాపంచిక నేను మాత్రమే అనుభవంలోకి వస్తుంది.అంతర్ముఖంగా తిరిగి లోని నేనును తెలుసుకోవడమే జ్ఞానోదయం.మనిషి జీవనానికి పరమావధి ఏమిటి? అజ్ఞానాన్ని జయించి తానెవరో తెలుసుకుని పూర్ణజ్ఞాని కావడమే మానవుని జీవితానికి ఏకైక పరమావది.తానెవరో తెలసుకోనంత కాలం సముద్ర తరంగాల్లా జన్మలు వస్తూపోతునే ఉంటాయి.దీపం ఉండగానే ఇల్లు చక్కపర్చుకోవడం అంటే ఈ జన్మలో కనీసం ఈ సృహ ఉన్న జీవితాన్ని వ్యర్థం చేయకుండా నేనెవరును తెలుసుకోవడానికి ప్రయత్నించామా జన్మ పరంపరలనుండి ఈజన్మలోనే విముక్తి లబిస్తుంది. ఈ శరీరమే నీవా?నేను అనే ఆలోచన పుట్టిన తరువాతే శరీర సృహ అనుభవంలోకి వస్తుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా శరీరం సృహ లేకుండా కూడ నేను ఉంది.కాబట్టి మొదటిది నేను,రెండవదే శరీరం. భగవంతుడికి శరణాగతి చెందడం ,నియమాలతో కూడిన శరణాగతి కాదు.మృత్యువు చుట్టుముట్టినప్పుడు మృత్యువు పరిపూర్ణ శరణాగతి చెందినట్ట్ల, ప్రథమ ఆలోచన ఐన నేను శాశ్వతంగా చనిపోయినపుడే మృత్యువు శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది. శాస్త్రాలను మితిమీరి చదవడం వలన లాభం లేదు.ఆత్మజ్ఞానానికి నేనెవరు అని విచారించాల్సిందేగాని,శాస్త్రాలను చదివి లాభంలేదు. శరీరం జడం, ఆత్మ చైతన్యం.ఈ రెంటికి నడుమ నేను అంటు ఒక అహంకారం తలెత్తుతున్నది. అహంకారం ఉన్నంతవరకు పురుష ప్రయత్నం ఉండవలసిందే.అహంకారం పడిపోగానే , కర్మలు సహజంగా సాగిపోతుంటాయి.ఆత్మ తన శక్తి ద్వార ఈ అనంత మైన విశ్వాన్ని సృష్టించింది.అయినప్పటికి ఆత్మ ఏమి చేయనిదిగానే ఉంది.శ్రీకృష్ణుడు భగవద్గీతలో సృష్టంగా చెప్పాడు ‘‘నేను ఏమి చేయని వాడినే.అయినప్పటికి అనంతమైన కర్మ నానుండి వెలువడుతుంది’’అని.ఈ అహంకార పూరిత మిథ్యానేను పోగొట్టుకోవడం కోసం ఏలాంటి కష్టపడనవసరం లేదు.ఈ మిథ్యానేను ఎక్కడినుండి పుడుతుందో ఆచోటును వెదకడానికి నేనెవరు అని విచారించడమే.ఆ తరువాత ఇక ఆత్మానుగ్రహమే పనిచేస్తుంది.ఇక అక్కడ చేయాడానికి అసలు ఏ ప్రయత్నం అవసరం లేదు.ఏ పురుష ప్రయత్నం ఆత్మానుగ్రహ పరిధిని తాకలేదు. ఒకటి తప్పని మరొకటి ఒప్పని ఎవరిని విమర్షించ వద్దు.విమర్షలవలన ఎవరు మారరు. ఆత్మయే భగవంతుడు.‘‘నేను ఉన్నాను’’అన్నదే భగవంతుడని బైబిల్ చెప్పింది. ‘‘నేను ఆత్మనై ఉన్నాను’’ అని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు.పంచేంద్రీయాలతో ద్వార(కన్ను,ముక్కు, చెవి,నోరు,స్పర్శ) అందే ఇంద్రియ జ్ఞానాన్నే సాదారణంగాప్రత్యక్ష జ్ఙానం అనుకుంటారు. ఇంద్రియాల సాయం లేకుండా ఆత్మ స్వయంగా నేను నేను అంటు అందరికి ప్రత్యక్షఃజ్ఞానాన్ని ఇస్తుంది.మేధస్సు కూడ ఆత్మ యొక్క ఒక ఉపకరణే. పరమాత్మ తాను మారకుండానే తనను తాను చూచేవాడుగా, చూడబడేదిగా, చూచేక్రియగా మారుతుంది. ప్రారబ్దాన్ని జయించడానికి మార్గాలు ఉన్నాయి.ప్రారబ్దం ఆత్మ కాకుండా అహంకారమే అనుభవిస్తుంది. అహాంకారాన్ని చంపడానికి ఉత్తమోత్తమ మార్గం పరిపూర్ణంగా భగవంతునికి శరాణాగతి చెందడం.అనుక్షణం చేసే పనుల్లో ‘‘నేను చేసేది ఏమిలేదు ఈశ్వరా.చేయించేది అంతా నీవే.నేను కేవలం ఒక పరికరాన్ని మాత్రమే.సర్వం ఈశ్వరార్పణం ’’అనుకుంటు అహంకార రహితంగా క్రియలు చేస్తు అహంకారాన్ని నశింప చేయడం ద్వారా ప్రారబ్దాన్ని జయించవచ్చును.అహంకారం వదిలేసి ఈశ్వరుడు నీతో ఏం చేయించదల్చుకున్నాడో అదిచేయడానికి నీవు సిద్దంగా ఉండాలి.ఇప్పటి వర్తమానం లేకుండా భూత భవిష్యత్తులు లేవు.ఆత్మ కాలాన్ని,ప్రదేశాన్ని దాటిఉన్నది.సత్యం ఇంతే సులువుగా ఉండాలనుకుంటున్నారా? మరింత జఠిలంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారా?జ్ఞాని అయినవాడు మాత్రమే నిజమైన కర్మయోగి కాగలడు.నిష్కామ కర్మను భోదించిన శ్రీ శంకరాచార్యులు కూడ దేశాటనం చేసి వ్యాఖ్యానాలను రాసాడు.ఇక్కడ కర్మ చేయడమా చేయకపోవడమా అనేది ముఖ్యం కాదు.కర్మ చేస్తున్నదెవరు అని నిరంతరం ప్రశ్నించుకోవాలి.కర్మ చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావనతో చేస్తే కర్మ ఫలితాలను తప్పక అనుభవించి తీరాలి.చేసే కర్తను నేను కాదు,ఒక దివ్య శక్తి తనరూపకంగా ఆపని చేయిస్తున్నదని స్వయంగా తెలుసుకున్నప్పుడు ,జ్ఞాని ఎంతటి కర్మ తనద్వార తనద్వార జరుగుతున్న నిశ్చలంగా ఉంటాడు.తాను కర్తను కాను అనే జ్ఞానం కలవాడే నిజమైన సన్యాసి.కర్మ ఫలితాలు అతనిని తాకనైనా తాకలేవు. ‘నేను’ అనే సృహే ఆత్మ . నేను అనే సృహలేకుండా ఉన్న వారెవ్వరు లేరు కాబట్టి అందరిలో ఆత్మ వ్యాపించి ఉంది.కాకపోతే అజ్ఞాని ఈ శరీరమే నేను అనుకోంటాడు,ఈ శరీరం ఆత్మకంటే భిన్నం కాదని జ్ఞాని తెలుసుకొంటాడు.జ్ఞాని అయినవారికి ఆగామి,సంచిత కర్మలే (భవిష్యత్తులో అనుభవించే,జమ ఐన కర్మలు) కాదు ప్రారభ్ద కర్మ కూడ మిగలదు. హృదయం(ఆత్మ స్థానం) నుండి శిరస్సులో ఉండే సహస్రారానికి (మనస్సు) అమృత నాడి ఉంది. ఆత్మశక్తి హృదయం నుండి అమృతనాడి ద్వార సహస్రారానికి చేరి అక్కడినుండి నాడులద్వార శరీరమంతా దశేంద్రియాల ద్వార బయటకు రావడం ద్వారనే నిత్యం వ్యవహరించే లోకానుభవాలు ఏర్పడుతున్నాయి. ఈ అనుభవాలు ఆత్మ శక్తి తప్ప మరొకటి కాదని గ్రహించడమే జ్ఞానం. సుఖం అనేది కూడ ఆత్మకు మారు రూపమే.మనస్సు బయటి ప్రపంచంలోని భౌతిక సంపదలతో లయం చెందినపుడు భౌతిక సుఖాన్ని అనుభవిస్తుంది.మనస్సు లోనికి వెళ్ళి ఆత్మవైపు తిరిగినప్పుడు అది ఆత్మ సుఖాన్ని అనుభవిస్తుంది.ఆత్మ సుఖం శాశ్వతం.బయటి ప్రపంచ సుఖాలు శరీరం నిలబడి ఉన్నంతవరకు మాత్రమే ఉండే తాత్కాలిక మిథ్యాసుఖాలు. మనసును బయటికి రానివ్వక ఆత్మలో నిలకడగా ఉండేటట్లు చేయడమే అన్ని సాధనల అంతిమ ధ్యేయం. హృదయమే శక్తి కేంద్రం. ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది. జ్ఞానిలో తెరుచుకుని ఉంటుంది.ఇది తెరుచుకోవడమే జ్ఞానం,మోక్షం. మౌనం నాలుగు రకాలు.అందరు అనుకునేట్లు మాట్లాడకపోవడం మౌనం కాదు.మౌనంలో వాక్ (నోటి)మౌనం,నేత్ర(కంటి)మౌనం,కర్ణ(చెవి)మౌనం,మానసిక మౌనం.మానసిక మౌనమే శుద్దమౌనం. మౌనమే ఆత్మకు మారుపేరు.కొన్నివందల ఉపన్యాసాలు,గ్రంథాలు చేయలేని పనిని జ్ఞాని కొన్ని క్షణాల మౌనం ద్వార సాధకునిలో వివేకాన్ని నింపగలడు.ఎన్ని శాస్త్రాలభ్యసించినా,ఎన్ని సాధనలు ,పుణ్యకర్మలు ఆచరించినా ఒక మహాజ్ఞాని చూపుకు సాటిరావు.జ్ఞానితో సాహచర్యం సాథనలోకెల్లా గొప్పసాధన. ఆత్మసాక్షాత్కారం కలిగినపుడు ప్రపంచంలో మీరుండే బదులు,మీలో ప్రపంచం ఉంటుంది. మాయ అసత్యం కాదు.ఇది ఆత్మయొక్క క్రియారూపం.ఈ మాయే నామ రూప బేధాలను కల్పిస్తుంది.మయాను విచ్చిన్నం చేసి తనను తాను తెలుసుకోవడమే జీవితాశయం,ఈ విషయం మర్చిపోవడమే మాయ.ఆత్మ జ్ఞానానికి అవరోధాలు మనసులో ఉండే వాసనలు.ఇవి నిరంతర ప్రయత్నపూర్వకంగా,దైవానుగ్రహంతోను దూరమవుతాయి.దైవానుగ్రహం వలనే ఎవరికైనా నేనును తెలుసుకోవాలనే వాంచ పుడుతుంది.భగవంతునికి,అనుగ్రహానికి,ఆత్మకు తేడాలేదు.అంతా ఒకటే. అగ్నినుండి నిప్పుకణం బయటకు వచ్చినట్లు ఆత్మనుండి అహంకారం బయటకు వచ్చి శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది.దేహమనే అలంబన లేకుండా అహంకారం నిలువదు.అహంకారం,జన్మాంతరాలుగా ఏర్పడ్డ మనో సంస్కారాలు ఒక్కసారిగా అరికట్టలేము.మనం శరణు చెంది స్వప్రయత్నంగా సాధన చేస్తుండగా తగిన సమయం వచ్చినప్పడు ఈశ్వరుని కటాక్షం లబిస్తుంది.ఈశ్వరుని కృపకై ఎదురుచూస్తు సాధన అశ్రద్ద చేయవద్దు.అది ఆయనకు జ్ఞాపకం చేయనవరంలేదు.అయన మనం చేసేదంతా చూస్తూనే ఉంటాడు. వేదాంత సారమంతా ఒక్కమాటలో చెప్పాలంటే భగవంతుడు మనిషితో అంటున్నాడు.‘‘ఓ మానవుడా నేను నీ హృదయంలోనే వున్నాను.నీవెవరివో తెలుసుకో’’. మనస్సు చంద్రుని లాంటిది , ఆత్మ సూర్యుని లాంటిది.ఆత్మనుండి వచ్చిన వెలుగుతో మనసు ప్రపంచాన్ని చూస్తుంది,వ్యవహరిస్తుంది.జీవితంలో సాధన చేయాల్సిందంతా మనస్సును స్వాధీనం చేసుకోవడంలోనే ఉంది.మనసు ఆడించి నట్లు మనిషి ఆడకుండా దానిని ఆధీనం చేసుకోవడంలోనే మనిషి లక్ష్యం.దురభ్యాసాలు,పూర్వజన్మ వాసనలు,మధ్యలో వచ్చే ఆటంకాలు ...వీటిని ఎదుర్కోవడానికి పురుష ప్రయత్నం అవసరం.అసలు ప్రయత్నం లేకుండా ఈశ్వర కటాక్షం దొరకదు. .‘‘నేను’’ అనే అహంకారం ఉన్నంతవరకు జ్యోతిష్యంతోపాటు అన్ని నిజమే.ఆ అహం నశించినప్పుడు ఏదీ నిజంకాదు.చూచేవాడుంటేనే చూడడం ఉంటుంది. శ్రీ రమణ మహర్షి జీవితం. తమిళనాడులోని మధురైకు దగ్గరలో తిరుచ్చలి గ్రామంలో సుందరమయ్యరు అలగమ్మ దంపతులకు క్రీ.శ.1879 డిసెంబర్ 30 వతేథి తెల్లవారు జామున ఒంటి గంటకు శ్రీరమణులు జన్మించారు.పుట్టినపుడు అతనికి వేంకటేశ్వరన్ నామం ఉండేది.చిన్నతనంలో అతనిని బడిలో చేర్చినపుడు అతని పేరు వెంటట్ రామన్ గా మారింది.ముద్దుగా రమణ పేరు వాడుకలోకి వచ్చి అదే పేరు నిలబడింది.రమణుల పెదనాన్న కూడ అతని 18వ ఏటనే సన్యసించి దేశాటనం పట్టాడు.రమణుల తండ్రి సుందరమయ్యరు తన 48వఏట చనిపోయారు.అప్పుడ రమణులకు 12 సంవత్సరాలు.రమణునితో పాటు మొత్తం నలుగురు సంతానం.అతని కంటే పెద్దఅన్ననాగస్వామికి 16 సం.లు.మూడవ కుమారుడు నాగసుందరానికి 6 సం.లు.నాలుగవ సంతానం పసిబిడ్డ.తన పెదనాన్న సుబ్బయ్యరు ఇంట రమణులు పెరిగాడు.రమణునికి 16 ఏడు వచ్చిన తరువాత 1896 జూలైలో ఎటువంటి గురపదేశం లేకుండానే ఆత్మానుభూతి పొందాడు.అప్పడు రమణులు మెట్రికులేషన్ చదువుతున్నాడు.అతనికి తిరువాణ్ణమాలైలోని అరుణాచల గిరి అంటే చిన్నప్పటి నుండి ఎడతెగని ఆకర్షణ.ఎప్పుడైతే అతనికి ఒకసారి ఆత్మానుభూతి అనుభవించాడో ఆపై చదువులు,జీవితం వ్యర్థంగా తోచి 1896 ఆగష్టులోనే ఇంట్లో ఎవరికి చెప్పపెట్టకుండా అరుణాచలం చేరుకున్నాడు.రమణులు అరుచాచలంలో 11 సంలు మౌనదీక్షలో ధ్యానం చేసారు.(1896-1907) రమణులు 1896-1922ల మద్య కొండపైనున్న విరుపాక్షగుహ,స్కందాశ్రమంలో గడిపాడు.1923 నుండి కొండకింద ప్రస్తుత ఆశ్రమంలో నిర్యాణం అయ్యో వరకు అనగా 1950 ఎప్రిల్ 14వతేధి శుక్రవారం రాత్రి 8.47 నిముషముల వరకు అక్కడే జీవించారు.

1 కామెంట్‌:

Sridhar చెప్పారు...

Nice Article.
U can check this blog once

http://bhagavanmemories.blogspot.com

ఆత్మ జ్ఞానం కోసం అన్వేషించేవారికి చివరి మజిలి